AP : బాధితులందరికీ న్యాయం చేయాలి…
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశం
కాకినాడ : మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ స్వాంతన కలిగించి, న్యాయం చేయాలని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలను పకడ్బందీగా రూపొందించి, ప్రభుత్వం ప్రకటించిన సాయం ఎవరూ మినహాయించబడకుండా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సౌకర్యాలపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సముద్రానికి ఆనుకుని ఉన్న మత్స్యకార గ్రామాల పరిస్థితులపై నిరంతరం నివేదికలు పంపాలని ఆయన ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ సీఎం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ, డీఆర్ఓ, ఆర్డీవోలు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, వ్యవసాయ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపాను అనంతర పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మొంథా తుపాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు.
కలెక్టర్ షాన్ మోహన్ వివరాల ప్రకారం, కాకినాడ జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు మున్సిపాలిటీలు మొంథా తుపానుతో ప్రభావితం అయ్యాయి. మొత్తం 61 ఇళ్లు దెబ్బతిన్నాయి. 41,932 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. అందులో 27,624 మత్స్యకార, 313 చేనేత కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. 21,711 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగిందని, 668 ఎకరాల్లో అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. మొత్తం 33,596 మంది రైతులు తుపాను కారణంగా నష్టపోయారని చెప్పారు. విద్యుత్ పరికరాలు, రోడ్లు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని వివరించారు. ఒక్క పిఠాపురంలోనే 2,500 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారని చెప్పారు. అంతటా ఉపశమన చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “పంట చేతికి వచ్చే సమయానికే తుపాను తాకింది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి రాలేదు. ప్రతి నష్టపోయిన రైతుకీ ప్రభుత్వం నుంచి పరిహారం తప్పనిసరిగా అందాలి. కష్టంలో ప్రభుత్వం మాకు తోడుందని రైతు సంతృప్తి చెందేలా యంత్రాంగం చర్యలు ఉండాలి” అని అన్నారు.
పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలబడి, పక్కా నివేదికలు తయారు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆస్తి నష్టాలను కూడా వివరంగా నమోదు చేసి, దెబ్బతిన్న ఇళ్లకు వెంటనే పరిహారం చెల్లించాలని సూచించారు.
తుపాను అనంతరం గ్రామాల్లో నిల్వ నీరు తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని, పల్లపు ప్రాంతాల్లో మళ్లీ వర్షాల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల పురోగతిపై గ్రామాల వారీగా నివేదికలు సమర్పించాలని, రోడ్లు దెబ్బతిన్న చోట తక్షణ మరమ్మతులు చేపట్టాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

Leave a Reply