— పంట నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహణ
హనుమకొండ, అక్టోబర్ 31:
ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన నేపథ్యంలో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను, నీటిలో మునిగిపోయిన గ్రామాలను గగనతల మార్గంలో స్వయంగా పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఆయనతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేమ్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. హెలికాప్టర్‌లో వరద ముంపు ప్రాంతాలైన మూలుగూ, మహబూబాబాద్, భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం పరిసరాలను పరిశీలించి పంటలకు జరిగిన నష్టంపై సమగ్ర సమాచారం సేకరించారు.
తదనంతరం సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండలోని కలెక్టర్ కార్యాలయం (IDOC)లో అధికారులతో వరద నష్టాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల పంట నష్టాల అంచనాలు, రహదారులు, చెరువులు, విద్యుత్ సరఫరా దెబ్బతిన్న పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. అధికారులు తక్షణ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..
“రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుంది. వరదల వల్ల జరిగిన పంట నష్టాలకు న్యాయమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం. అధికారులు గ్రామాల వారీగా అంచనాలు పూర్తి చేసి, తక్షణ సహాయం అందించాలి” అని తెలిపారు.
అలాగే వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలు, చెరువుల పరిస్థితి పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ ఏరియల్ సర్వేలో పాల్గొన్న మంత్రులు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పలు ప్రాంతాలు ఇంకా తడిసిపోయిన వాతావరణంలో ఉన్నాయని, పంటలు భారీగా దెబ్బతిన్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
